CM Revanth

అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

యేడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ రిపోర్ట్- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth reddy) స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబెద్కర్ సచివాలయంలో ప్రజాపాలన అభయహస్తం (Abhayahastam) ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్‌, దరఖాస్తు ఫారంను సీఎం రేవంత్ విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిసెంబరు 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్‌ వార్డుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పధకాలకు సంబంధించిన అప్లికేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. జనవరి 6 వరకు మొత్తం ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని సీఎం తెలిపారు. జనవరి 7లోపు ఈ పధకాలకు సంబందించిన లబ్ధిదారుల వివరాలు సేకరించి.. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తామని చెప్పారు. ప్రజా పాలనలో ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలను, సమస్యలను తెలుకుని న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని, టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించగా, గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నాక కొత్త బోర్డును ఏర్పాటు చేసి ఛైర్మన్‌, సభ్యులను నియమిస్తామని చెప్పారు. గ్రూప్‌- 2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అఅన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 22 కొత్త ల్యాండ్ రోవర్ కార్లు కొని విజయవాడలో దాచి పెట్టారని చెప్పిన రేవంత్.. మూడోసారి అధికారంలోకి వస్తే వాటిని వాడుదామనుకున్నారని చెప్పారు. ఇక రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి తప్పకుండా న్యాయ విచారణ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. విచారణ తర్వాత ఎల్‌ అండ్‌ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తేలుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్న రేవంత్..6.71లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణను నిండా ముంచారని మండిపడ్డారు. అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతాంమన్న ముఖ్యమంత్రి.. రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితి విధించలేదని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సక్సెస్ అయ్యిందని, ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించామని, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 


Comment As:

Comment (0)