A Revanth

నా బంధువులకు పదవులు ఇవ్వడం ఉండదు..

ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు- సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) పలు కీలక అంశాలను వెల్లడించారు. మెట్రో రైల్, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు సీఎం. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రాజెక్టులను సరళీకృతం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. నూతన సంవత్సరం సందర్బంగా సెక్రెటరియేట్ లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు సీఎం. శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే మెట్రో రైల్ దూరాన్ని తగ్గిస్తామని చెప్పుకొచ్చారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి విమానాశ్రయానికి 32 కిలో మీటర్ల దూరం ఉంటుందన్న ముఖ్యమంత్రి రేవంత్.. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో మార్గం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

ఇక ముచ్చింతల్ ఫార్మాసిటీ, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్‌ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. స్పెషల్ క్లస్టర్ల దగ్గర పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇక యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ అందిస్తామని చెప్పారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని చెప్పి సీఎం రేవంత్.. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్‌ పవర్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని అన్నారు.

ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జిలుగా మంత్రులను నియమించి వారికి బాధ్యతలు అప్పగించామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ లో మూడు కమిషనరేట్లకు కమిషనర్లను నియమించామని.. వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారని అన్నారు. ప్రభుత్వ శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు తన పని అని చెప్పి ముఖ్యమంత్రి.. వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలని చెప్పారు. ఇక జనవరి 3 పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల మేరకు వారివారికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని చెప్పారు. తనకు దగ్గరగా ఉంటారనో, తనకు బంధువలనో పదవులు ఇవ్వడం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 


Comment As:

Comment (0)