CEC

ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఈసీ చర్యలు

తెలంగాణలో కలెక్టర్లు, కమీషనర్లపై బదిలీ వేటు వేసిన ఈసీ

హైదరాబాద్ రిపోర్ట్ - తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ మేరకు నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమీషనర్లను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ కలెక్టర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో మరికొంత మంది అధికారులుపై వేటు పడనుందని ఎలక్షన్ కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో శాసనసభ ఎన్నికల నేపధ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుంబిగించింది. ఈమేరకు విధి నిర్వహణలో పక్షపాతవైఖరి, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నార్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఈసీ కొరఢా ఝులిపించింది. 

ఈ క్రమంలో రాష్ట్రంలో నలుగురు జిల్లా కలెక్టర్లు, 13 మంది కమీషనర్లు, ఎస్పీలను బదిలీచేసింది ఎన్నికల సంఘం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది ఈసీ. మరోవైపు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ వి.సత్యనారాయణ, ఖమ్మం సీపీ తో పాటు రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్ ముషారఫ్‌ అలీని కూడా బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇదే సమయంలో ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశించింది. పనితీరు, వారిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఎలక్షన్ కమీషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈనెల మొదటి వారంలో హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా జరిగిన సమావేశం సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుపై స్వయంగా హెచ్చరించారు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ పర్యటనలో ప్రతపక్ష పార్టీలు పలువురు అధికారులపై పిర్యాదు చేశాయి. కొంత మంది కలెక్టర్లు, ఎస్పీలు, కమీషనర్లు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, వారిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ఈసీ, పూర్తిస్థాయిలో ఇంటెలిజెన్స్ నివేధిక పరిశీలించిన తరువాత ఈ బదిలీలకు పూనుకుందని తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో మరికొంత మంది అధికారులపై బదిలీ వేటు పడనుందని సమాచారం. 


Comment As:

Comment (0)