Baby Movie

కొత్త తరం రావాలి.. అప్పుడే చిత్రసీమ కొత్త పుంతలు తొక్కుతుంది

బేబి సినిమా ఫీలింగ్‌ నన్ను మూడు రోజులు వెంటాడింది - చిరంజీవి

మూవీ రిపోర్ట్- హైదరాబాద్‌లో జరిగిన బేబి (Baby) సినిమా మెగా కల్ట్‌ సెలబ్రేషన్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయిరాజేష్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ లో సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. పా త తరంలోనే ఆగిపోతే చిత్ర పరిశ్రమ వెనకబడిపోతుందని, కొత్త తరం రావాలని, అప్పుడే చిత్రసీమ కొత్త పుంతలు తొక్కుతూ నిరంతరంగా ముందుకు సాగిపోతుంటుందని ఈ సందర్బంగా చిరంజీవి అన్నారు.

తాను పుత్రోత్సాహం ఎంత పొందుతున్నానో, ఇండస్ట్రీలో తన అభిమానుల ఎదుగుదల చూసి అంతే గర్వపడుతున్నానని చెప్పారు. ఈరోజున తన అభిమానులు చేసిన ఓ ప్రయత్నం ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు, ప్రజల ఆశీస్సులు దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు చిరంజీవి. సాయిరాజేష్‌ కామెడీ సినిమాలు తీయడమే కాదు, జాతీయ పురస్కారం అందుకున్న చిత్రాలకు కథ అందించగలనని కలర్‌ ఫొటో తో నిరూపించారని చెప్పారు. బేబి లోని సమకాలీన కథ, అందులోని దర్శక విలువలు, దాని ద్వారా రాజేష్‌ ఇచ్చిన సందేశం మామూలుది కాదని వ్యాఖ్యానించారు చిరంజీవి.

ఆనంద్‌ ఈ సినిమాలో సహజంగా నటించాడన్న మెగాస్టార్.. తన ప్రియురాలి గురించి నిజం తెలిసిన సందర్భంలో ఆనంద్‌ కనబరిచిన భావోద్వేగాలు చూసి అతనిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా.. అని ఆశ్చర్యపోయానని చెప్పారు. వైష్ణవి మానసిక సంఘర్షణ ఈ చిత్రాన్ని నిలబెట్టిందని.. బేబి సినిమా ఫీలింగ్‌ నుంచి రెండు మూడు రోజులు బయటకు రాలేకపోయానని చిరంజీవి అన్నారు. జీవితంలో చిరంజీవిని చూస్తే చాలనుకున్నానని, ఇప్పుడాయన తాము నటించిన సినిమా సక్సెస్‌ మీట్‌ కు రావడంతో కల నిజమైనట్లు ఉందని వైష్టవి చైతన్య చెప్పింది. సినిమా బావుంటే ప్రేక్షకులు ఎలాంటి కారణాలు చూడకుండా విజయాన్ని అందిస్తారని, వాళ్ల ప్రేమ వల్లే బలగం, సామజవరగమన, మా బేబి వంటి చిన్న సినిమాలు పెద్ద హిట్టయ్యాయని విజయ్ దేవరకొండ అన్నారు.
 


Comment As:

Comment (0)