షారుక్, నయనతార జవాన్ ఎలా ఉందంటే

షారుక్ ఖాన్ “జవాన్” మూవీ రివ్యూ..

మూవీ రిపోర్ట్- బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నయమతార జంటగా తమిళ స్టార్ డైరక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా రివ్యూ మీ కోసం..

సినిమా- జవాన్‌- Jawan movie review

తారాగణం- షారుక్‌ ఖాన్‌, విజయ్‌ సేతుపతి, దీపిక పదుకొణె, నయనతార, ప్రియమణి, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌, సాన్య మల్హోత్ర తదితరులు 

మ్యూజిక్- అనిరుధ్‌ రవిచందర్‌ 

సినిమాటోగ్రఫీ- జి.కె.విష్ణు

ఎడిటింగ్‌- రుబెన్‌

నిర్మాతలు- గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మ 

స్క్రీన్‌ప్లే- రమణ గిరివసన్‌

కథ, దర్శకత్వం- అట్లీ 

విడుదల- 07-09-2023

పరిచయం... Jawan movie review

బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) ప‌ఠాన్‌ మూవీతో ఫామ్‌ లోకి వ‌చ్చిన తరువాత ఇప్పుడు జ‌వాన్‌ (Jawan)గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాడు. షారుక్ జవాన్ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంత ఆత్రుత‌గా వెయిట్ చేశారో దాని అడ్వాన్స్ బుకింగ్స్ చెప్పకనే చెప్పాయి. షారుక్‌ ఖాన్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్ కావ‌డంతో ఉత్త‌రాదిలోనే కాకుండా ద‌క్షిణాదిలోనూ జవాన్ సినిమాపై ఆస‌క్తి నెలకొంది. మ‌రి జవాన్ సినిమా ఎలా ఉంది, షారుక్‌ ఖాన్ నటన ఎలా ఉండి, జవాన్ ప్రేక్షకులను మెప్పించాడా..

జవాన్ కధ... Jawan movie review

ముంబయిలో మెట్రో ట్రైన్ హైజాక్ తో జవాన్ కధ మొదలవుతుంది. గుండుతో క‌నిపించే ఓ అజ్ఞాత వ్య‌క్తి (షారుక్‌ ఖాన్‌) త‌న గ్యాంగ్‌ లోని ఆరుగురు యువతులతో క‌లిసి ముంబయి లోని మెట్రో ట్రైన్ ను హైజాక్ చేస్తాడు. ప్ర‌భుత్వాన్ని 40 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అవసరం ఐతే ట్రైన్ లో ఉన్న ప్ర‌యాణికుల ప్రాణాల్ని తీయ‌డానికి కూడా వెన‌కడుగు వేయడు. మెట్రో ట్రైన్ ను హైజాక‌ చేసిన వారిని ప‌ట్టుకోవ‌డం కోసం ఐపీఎస్ న‌ర్మ‌ద (నయనతార) (Nayanatara) ని రంగంలోకి దింపుతుంది ప్రభుత్వం. కానీ తాను అనుకున్న‌ది సాధించి తెలివిగా తప్పించుకుంటాడు హైజాకర్. ప్రభుత్వం నుంచి తీసుకున్న 40 వేల కోట్ల‌ రూపాయలను పేద‌ వాళ్ల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తాడు షారుక్ ఖాన్. దీంతో దేశవ్యాప్తంగా మెట్రై ట్రైన్ హైజాక‌ర్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నం అవుతుంది. ఐపీఎస్ అధికారు న‌ర్మ‌ద‌, త‌న టీం జరిపిన విచారణలో హైజాక‌ర్ ఓ జైలులో విధులు నిర్వ‌ర్తించే జైల‌ర్ ఆజాద్ (షారుక్‌ ఖాన్) పోలిక‌ల‌తో ఉన్న‌ట్టు తెలుసుకుంటారు. జైల‌ర్ ఆజాదే మెట్రో ట్రైన్ ను హైజాక్ చేశాడా? అతని వెంట ఉన్న ఆరుగురు అమ్మాయిలు ఎవ‌రు? గతంలో ఆర్మీలో ప‌నిచేసిన విక్ర‌మ్ రాథోడ్ (షారుక్‌ ఖాన్‌)కు, ఆజాద్‌ కు (షారుక్ ఖాన్) మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఎంటీ? ప‌్ర‌పంచంలోని అతి పెద్ద ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్ (విజ‌య్ సేతుప‌తి) (Vijay Sethupathi) పాత్ర ఎంటీ? ఇటువంటి విషయాలన్నీ తెలియాలంటే మాత్రం జవాన్ సినిమాను ధియేటర్స్ లో చూడాల్సిందే...

హీరోయిజం, మంచితనం, విరోచిత పోరాటాలు.. ఇలా అన్ని కలగలిపిన పాత్రల్లో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ని చూపించారు అట్లీ. జవాన్ సినిమాను షారుక్‌ ఇమేజ్‌, మార్కెట్ మ‌రింత‌గా క‌లిసి రావ‌డంతో అదనపు హంగులు జోడించి రూపొందించారు. షారుక్‌ ఖాన్ ఎప్పుడూ క‌నిపించ‌నంత మాస్‌ గా, వైవిధ్యమైన గెట‌ప్స్ లో క‌నిపించ‌డం ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. జవాన్ లో కీల‌క‌మైన  ప్ర‌తి పాత్ర‌కీ ఫ్లాష్‌ బ్యాక్ ఉండేలా కధ రాసుకున్నాడు అట్లీ. అలా అందరి గతాలను తెలుసుకోవాల‌నే ఆత్రుక ప్రేక్ష‌కుల్లో క‌లిగిస్తూ క‌థ‌ని ముందుకు తీసుకెళ్లాడు. సినిమా ప్రారంభం కాగానే నేనెవ‌ర్ని అనిపిస్తూ షారుక్‌ ని ప‌రిచ‌యం చేసిన డైరెక్టర్ అట్లీ, ఆ తరువాత మెట్రో ట్రైన్ హైజాక్ సీన్ తో క‌థలోకి తీసుకెళ్లాడు. షారుక్‌ ఖాన్ మార్క్ వినోదం ఏమాత్రం త‌గ్గ‌కుండా జాగ్రత్త పడ్డాడు అట్లీ.

ఒక‌వైపు ఆజాద్‌ ని ప‌ట్టుకోవ‌డం కోసం పోలీసుల ప్ర‌య‌త్నాలు, మ‌రోవైపు ప్రేమ స‌న్నివేశాల నేప‌థ్యం మంచి డ్రామాని పండించింది. మధ్యలో వ్య‌వ‌సాయశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి నేప‌థ్యంలో వ‌చ్చే సీన్స్ ప్ర‌థ‌మార్ధానికి హైలైట్‌ అని చెప్పాలి. ఇంట్రవెల్ స‌న్నివేశాలు జవాన్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. విక్ర‌మ్ రాథోడ్‌ గా షారుక్‌ ఖాన్ ప‌రిచ‌యం కావ‌డం, ఆ వెంట‌నే మొద‌ల‌య్యే ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. షారుక్‌ ఖాన్, దీపికా ప‌దుకొణే మ‌ధ్య స‌న్నివేశాలు త‌క్కువే అయినా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. దీపికా పదుకొణే (Deepika Padukone) ఓ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చి, పెంచి పెద్ద చేసే సీన్స్, బిడ్డను వ‌దిలిపెట్టి వెళ్లిపోయే స‌న్నివేశాలు అందరిని కంటతడిపెట్టిస్తాయి.

 ఇంటర్వెల్ తరువాత ఎన్నికలకు సంబందించిన ఈవీఎమ్ నేప‌థ్యంలో వచ్చే స‌న్నివేశాలు జవాన్ కు మరొక హైలైట్‌ అని చెప్పాలి. షారుక్‌ ఖాన్ ఏ సీన్ లో, ఏ గెటప్ లో కనిపించినా అభిమానులు చ‌ప్ప‌ట్లు కొట్టేలా హీరోయిజమ్ తో కధను నడిపించాడు డైరెక్టర్ అట్లీ. పోరాట సన్నీవేశాలు, ఎండింగ్ ఎపిసోడ్ అద్భుతం అని చెప్పాలి. ఐతే జవాన్ లో కొన్ని సందర్బాల్లో వచ్చే స‌న్నివేశాలు కొంత డ్ర‌మటిక్‌గా అనిపిస్తాయి. కానీ మాస్ మ‌సాలా సినిమాల్లో అలాంటివి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని దర్శకుడు భావించినట్లుగా అనిపిస్తుంది. షారుక్‌ అభిమానుల‌కి కావ‌ల్సినంత సంద‌డిని పంచే ఈ సినిమా జవాన్. చివర్లో మాధ‌వ‌న్ నాయ‌ర్ పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ (Sanjay Dutt) టక్కున మెరిసి అందరిని ఆశ్చర్యంలో ముంచుతాడు.

జవాన్ లో ఎవరు ఎలా చేశారు Jawan movie review

ఇక జవాన్ అంతా షారుక్‌ ఖాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షారుక్ ఖాన్ రెండు విభిన్నమైన కోణాల్లో సాగే పాత్ర‌లో అద్బుతమైన నటనను ప్ర‌ద‌ర్శించారు. దాదాపు రెండు పాత్రల్లో జీవించేశారు. అన్ని గెట‌ప్పుల్లో షారుక్ ఖాన్ ఒదిగిపోయిన తీరు ఔరా అనిపిస్తుంది. పోరాటా సన్నివేశాలు, సాంగ్స్ లో తనదైన శైళిలో అదరగెట్టిన షారుక్.. సొసైటీ సంబందిత సన్నివేశాలు, కుటుంబం నేప‌థ్యంలో వ‌చ్చే సీన్స్ లో అదరగొట్టాడు. ఇక లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ ఉండే కీలకమైన పాత్రలో మెప్పించింది. ఐతే షారుక్‌ ఖాన్ కు, నయనతారకు మ‌ధ్య కెమిస్ట్రీ అంత‌గా కుదరలేదన్న మాట వినిపిస్తోంది. ఇక దీపికా పుదుకొణే తన పాత్ర పరిధి మేరకు నటించింది.

ప్రపంచస్థాయి ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్‌ గా విజ‌య్ సేతుప‌తి జవాన్ సెకండ్ హాఫ్ లో తనదైన ముద్ర వేశాడు. మరోవైపు ప్రియ‌మ‌ణి, సాన్య మ‌ల్హోత్రా, రిద్ధి, సంజీత త‌దిత‌రులు ప్రాముఖ్యత ఉన్న రోల్స్ లో కనిపించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ విష్ణు కెమెరా ప‌నిత‌నాన్ని మెచ్చుకోవాల్సిందే. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాట‌ల కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ షారుక్‌ ఖాన్ హీరోయిజాన్ని మ‌రోస్థాయికి తీసుకెళ్లాడని చెప్పాలి. ఎడిటింగ్‌, యాక్ష‌న్‌, మేక‌ప్, ప్రొడ‌క్ష‌న్ డిజైన్.. ఇలా కీలకమైన అన్ని విభాగాల పనితనం తెరపై కనిపిస్తుంది. డైరెక్టర్ అట్లీ జవాన్ క‌థ రాసుకున్న విధానం, సూటిగా సుత్తి లేకుండా చెప్పిన విధానం, స్కీన్ పై కళ్లకు కట్టినట్లు చూపించిన విధానం అద్భుతమని చెప్పాలి.

న్యూస్ పిల్లర్ రేటింగ్- 4/5

Newspillar Rating- 4/5

Note- ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Jawan movie review in telugu

 


Comment As:

Comment (0)