Chiranjeevi Birthday

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేకం

అవమానాలు-కృషి-పట్టుదల కలిస్తే మెగాస్టార్ చిరంజీవి 

స్పెషల్ రిపోర్ట్- కొణిదెల శివశంకర వరప్రసాద్ (Konidela Siva Sankara Vara Prasad) ఈ పేరు కొందరికి తెలసు. అందరికి తెలిసిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ సమయంలోనే నంబరు వన్ హీరోగా ఎదిగారు చిరంజీవి. కృషి, పట్టుదల, అవమానాలు.. ఇలా ఎన్నో చవి చూశారు చిరంజీవి. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన లైఫ్ జర్నీ మీ కోసం....

 తెలుగు సినీ పరిశ్రమలోకి శివ శంకర వరప్రసాద్‌ (చిరంజీవి) 1978లో అడుగుపెట్టారు. చాలా ప్రయత్నాల తర్వాత మొదటిసారి పునాది రాళ్లు ఆనె సినిమాలో నటించారు. ఐతే చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమా పునాది రాళ్లు మూవీ కంటే ముందు రిలీజ్ అయ్యింది. దీంతో ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి ప్రేక్షకులకు మొట్టమొదటిసారి వెండితెరపై కనిపించారు. సినీ ప్రయత్నాలు చేసే సమయంలో హరిప్రసాద్‌, కమేడియన్ సుధాకర్‌ లతో మద్రాసులో ఉండేవారు చిరంజీవి. పూర్ణా పిక్చర్స్‌ సంస్థ మేనేజరు తాము పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి, వాటి రివ్యూలు రాయమని వారికి చెప్పేవారట.

అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చొన్నారు. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి డ్రైవర్‌, మేకప్‌ మ్యాన్‌ లు రావడంతో చిరంజీవి, హరిప్రసాద్‌, సుధాకర్‌ లను లేపి, వారిని కూర్చోబెట్టారట. దీంతో చిరింజీవి నిల్చొనే సినిమాని చూశారట. ఆ తరువాత సినిమా ఎలా ఉందని పూర్ణా పిక్చర్స్ సంస్థ అధినేత భార్య చిరంజీవిని ప్రశ్నించగా.. ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం, కానీ ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు.. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం.. ఆంటీ.. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి.. అని ఆవేశంతో అన్నారట చిరంజీవి. ఆయన ఆరోజు చెప్పినట్టే తక్కువ సమయంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).

ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌ ని ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత అని చెప్పాల్సిందే. 1983 లో వచ్చిన ఖైదీ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. చిరంజీవికి మాస్‌ ఇమేజ్‌, స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది ఖైదీ సినిమా. ఆ తరువాత చిరంజీవి వెనుతిరిగి చూసుకోలేదు. ఐతే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి కొన్నాళ్లు, నటనకు దూరమవడం అభిమానులును బాధపెట్టింది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఖైదీ నం 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్రేక్షకుల్లో మళ్లీ అదే ఊపు తీసుకువచ్చారు. ఇప్పటి వరకు చిరంజీవి మొత్తం 155 సినిమాల్లో నటించారు. నంది, ఫిల్మ్‌ఫేర్‌ వంటి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న చిరంజీవిని..  భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ తో సత్కరించింది. 

చిరంజీవిని ముందు సుప్రీమ్‌ హీరో అన్న బిరుదు వరించగా, ఆ తర్వాత మెగాస్టార్‌ గా పేరుగాంచారు. 1988 లో వచ్చిన మరణ మృదంగం సినిమా తరువాత ఆ చిత్ర నిర్మాత కె.ఎస్‌. రామారావు చిరంజీవికి మెగాస్టార్ అన్న బిరుదు ఇచ్చారు. 1987లో ప్రపంచ ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ వేడుక లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు చిరంజీవి. 1999- 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఇన్ కం ట్యాక్స్ చెల్లించడంతో చిరంజీవిని సమ్మాన్‌ అనే అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 1992లో దేశంలోనే కోటి రూపాయల అత్యధిక పారితోషికం తీసుకున్న మొదటి భారతీయ నటుడిగా రికార్డు సృష్టించారు చిరంజీవి. ఇక పర్సనల్‌ వెబ్‌ సైట్‌ కలిగిన మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ చిరంజీవి. చిరంజీవి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే https://www.kchiranjeevi.com/  వెబ్ సైట్ లో. (Happy Birthday  Chiranjeevi)
 


Comment As:

Comment (0)