ఉజ్జయిని మహాకాళి ఆలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు
బోనాల జాతరలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించిన మంత్రులు
మేళతాళాలతో సీఎంకు ఘన స్వాగతం.. భక్తులతో కిటకిటలాడిన ఆలయం
హైదరాబాద్- తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మేళతాళాలు, పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానం పలికారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలను సీఎంకు అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
బోనాల జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించగా.. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.
