లోకేశ్‌పై అసభ్య పోస్టులు.. వైసీపీ సోషల్ మీడియా నేత అరెస్టు
ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తకు బెదిరింపులు.. కేసు నమోదు
మంత్రి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు సన్నపనేని వెంకట్రావును పల్నాడు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తను చంపేస్తానంటూ బెదిరించినట్లు నమోదైన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వినుకొండ మండలం పానకాలపాలేనికి చెందిన సన్నపనేని వెంకట్రావు సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు చేశాడు. ఈ పోస్టులను టీడీపీ కార్యకర్త వీరగంధం ప్రశాంత్ ప్రశ్నించగా, ఆయనను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, చంపేస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో వీరగంధం ప్రశాంత్ వినుకొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట్రావును అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నిందితుడిని శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. పోలీసులు కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
