తైపీ ఓపెన్ విజేతగా తన్వి శర్మ
18 ఏళ్ల తర్వాత భారత్‌కు మహిళల సింగిల్స్ టైటిల్..
ఫైనల్లో వియత్నాం షట్లర్‌పై వరుస సెట్లలో విజయం
కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టైటిల్ సొంతం
భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వి శర్మ తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఫైనల్లో వియత్నాంకు చెందిన లిన్ ఎంగుయెన్‌ను 21-16, 21-16 తేడాతో వరుస సెట్లలో ఓడించి కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టైటిల్‌ను అందుకుంది.
ఈ విజయంతో తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో 18 ఏళ్ల తర్వాత భారత్‌కు మరోసారి ఛాంపియన్‌గా నిలిచిన క్రీడాకారిణిగా తన్వి గుర్తింపు పొందింది. అంతకుముందు 2008లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి భారత జెండాను ఎగురవేస్తూ తన్వి ఆ నిరీక్షణకు తెరదించింది.
పంజాబ్‌కు చెందిన యువ షట్లర్ తన్వి శర్మ ఇటీవల అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. తైపీ ఓపెన్‌లో కూడా తొలి రౌండ్ నుంచే అద్భుత ఆటతీరును కనబరిచిన ఆమె.. ఫైనల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఈ విజయం తన్వి కెరీర్‌లోనే అత్యంత కీలక మైలురాయిగా నిలవడంతో పాటు.. భారత మహిళల బ్యాడ్మింటన్‌కు మరో ఆశాకిరణం లభించినట్లయింది. యువ వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో టైటిల్ గెలవడంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందనే ఆశలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
