వచ్చే ఎన్నికల్లో జెన్‌జీదే కీలక పాత్ర-కేటీఆర్

వచ్చే ఎన్నికల్లో జెన్‌జీదే కీలక పాత్ర-కేటీఆర్

18-24 ఏళ్ల యువతే రాజకీయాలను ప్రభావితం చేస్తారు

ఇప్పటి తరం వార్తలను రీల్స్‌లోనే చూస్తోందని వ్యాఖ్య

రానున్న ఎన్నికల్లో జెన్‌జీ ఓటర్లే రాజకీయాలను ప్రభావితం చేసే కీలక శక్తిగా మారనున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత సంప్రదాయ మీడియా కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువగా ఆధారపడుతోందని అన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, కొత్త తరం తమ అభిప్రాయాలను వినిపించే విధానం పూర్తిగా మారిపోయిందన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్లే అధికారంలో ఉన్నవారు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

వాట్సాప్ అంకుల్స్.. ఇన్‌స్టా పిల్లల్లో ఎవరు గెలిచారో అందరూ చూశారు. అర్ధరాత్రి ప్రధాని మోదీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా లేకపోతే ఈ స్థాయిలో జవాబుదారీతనం వచ్చేది కాదు" అని కేటీఆర్ పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్‌జీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత పత్రికలు, టెలివిజన్ కంటే మొబైల్ ఫోన్ ద్వారానే వార్తలను తెలుసుకుంటోందని, ముఖ్యంగా రీల్స్‌, షార్ట్ వీడియోల రూపంలోనే న్యూస్‌ను ఫాలో అవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.