భోగాపురం విమానాశ్రయానికి ప్రధాని మోదీ ప్రారంభం
'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'ను జాతికి అంకితం
గిరిజనుల థింసా నృత్యంతో ఘన స్వాగతం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఆధునిక హంగులతో నిర్మించిన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం, విమానాశ్రయంలోని సౌకర్యాలను పరిశీలించారు.
ప్రధాని వెంట రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు, ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు.
విమానాశ్రయ టెర్మినల్‌ను సందర్శించిన ప్రధానికి జీఎంఆర్ సంస్థ అధికారులు చెక్-ఇన్ హాల్, ప్రయాణికుల సౌకర్యాలు, భవనం రూపకల్పన, ఆధునిక సాంకేతిక వ్యవస్థల గురించి వివరించారు. విమానాశ్రయం నిర్మాణంలో అనుసరించిన ప్రత్యేకతలను కూడా ఆయనకు వివరించారు.
13,750 మందితో థింసా నృత్యం.. ప్రత్యేక ఆకర్షణ
ప్రారంభోత్సవ వేడుకల్లో గిరిజన సంస్కృతి ప్రతిబింబించే థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు ఒకేసారి థింసా నృత్యం చేస్తూ ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు.
ప్రయాణికుల టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గంలో ఓపెన్‌టాప్ జీపులో ప్రయాణించిన ప్రధాని మోదీ, గిరిజన కళాకారుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతిని ప్రతిబింబించిన ఈ నృత్యం వేడుకలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది.
