హైడ్రా ఆగదు.. చెరువుల పునరుజ్జీవమే లక్ష్యం-సీఎం రేవంత్ రెడ్డి
ఉప్పల్ నల్లచెరువు అభివృద్ధిని ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా ఆస్తులను కాపాడుతూ.. భావితరాలకు మెరుగైన హైదరాబాద్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
హైడ్రా చర్యలపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైడ్రాకు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఉప్పల్ నల్లచెరువు పునరుద్ధరణ పనులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను పంచుకున్న ఆయన.. చెరువుల పరిరక్షణ అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, భావితరాలకు మెరుగైన భవిష్యత్తును అందించడమని వ్యాఖ్యానించారు.
ఉప్పల్ నల్లచెరువు గత పరిస్థితి, ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులను 'నాడు-నేడు' వీడియో రూపంలో పోస్టు చేసిన సీఎం.. హైడ్రా అధికారులు, సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. నగరంలోని చెరువులకు మళ్లీ జీవం పోస్తూ హైదరాబాద్ రూపురేఖలను మార్చే పనిలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
రూ.20 కోట్లతో నల్లచెరువుకు కొత్త రూపు
హైడ్రా ఆధ్వర్యంలో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఉప్పల్ నల్లచెరువును ఆధునికంగా అభివృద్ధి చేశారు. చెరువు శిఖంలో ఉన్న ఆక్రమణలను తొలగించడంతో పాటు.. వరదనీరు సులభంగా చేరేలా ఇన్‌లెట్లు, మురుగునీరు కలవకుండా ప్రత్యేక డైవర్షన్ కాలువలు నిర్మించారు. నీటిమట్టం పెరిగినప్పుడు వరద ముప్పు లేకుండా ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి.. అదనపు నీరు మూసీలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు.
ఇటీవల కురిసిన వర్షాలతో నల్లచెరువు పూర్తిగా నిండిపోవడంతో అక్కడి దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. గతంలో మురుగునీటితో కళావిహీనంగా కనిపించిన చెరువు.. ప్రస్తుతం పర్యాటక కేంద్రాన్ని తలపించేలా మారిందని స్థానికులు చెబుతున్నారు.
విమర్శల నడుమ సీఎం మద్దతు
హైడ్రా చర్యలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, ఇటీవల హైకోర్టు తీర్పు కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పనితీరును బహిరంగంగా ప్రశంసించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
"ప్రతి చెరువును కాపాడుతూ.. ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతాం. చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్ మరింత అందంగా మారుతోంది" అని సీఎం తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో హైడ్రాపై ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలను సీఎం మరోసారి స్పష్టం చేసినట్లయింది.
