అక్రమాస్తుల కేసుల విషయంలో తమకు ప్రధాని మద్దతు ఉందని చెప్పుకుంటున్న వైసీపీ నేతలకు ప్రధాని మోదీ వ్యాఖ్యలు కలవరంలోకి నెట్టాయి. పైకి బీజేపీతో సత్సంబంధాలు లేకున్నా.. లోపల మాత్రం మోదీతో సీఎం జగన్ మంచి సంబంధాలనే కలిగి ఉన్నారని ఇన్నాళ్లూ వైసీపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులు పెద్దగా ప్రభావం చూపవని, మోదీ ఆశిస్సులతో ఈ కేసులన్నీ మరుగున పడిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. కానీ వారి అంచనాలను తల క్రిందులు చేసేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో వేలకోట్ల రూపాయల కుంభకోణాలు, డొల్ల కంపెనీలు దేశంలో చర్చనీయాంశంగా నిలిచాయని మోదీ అన్నారు. అవినీతి నిరోధం, విజిలెన్స్ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసుల దర్యాప్తులో జాప్యం భవిష్యత్తు కుంభకోణాలకు పునాదిగా మారుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. అక్రమాస్తులపై చర్యలు తీసుకోకపోతే సమాజంలో నేరాలు పెరిగిపోతాయన్నమోదీ.. మన ఎదురుగా ఉన్న వ్యక్తి తప్పుడు మార్గంలో వేలకోట్ల రూపాయలు సంపాదించాడని తెలిసినా అలా చూస్తూ వదిలేస్తే అది దేశాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఘాటూగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్పై ఉన్న కేసుల్లో రోజువారీ విచారణ ప్రారంభమైంది. ఇటువంటి సమయంలో ప్రధాని మోదీ అవినీతి కేసుల్లో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది భవిష్యత్ అక్రమాలకు దారి తీస్తుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమమవుతోంది. ప్రధాని వ్యాఖ్యలను చూస్తే అవినీతి కేసుల విషయంలో కేంద్రం సీరియస్ గా ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.