తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, టీఆర్ ఎస్ సీనియర్ నేత స్వామిగౌడ్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. నడ్డా స్వామి గౌడ్ కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరడమంటే తిరిగి తన తల్లిగారింటికి వచ్చినట్లు భావిస్తున్నానని ఈ సందర్బంగా స్వామి గౌడ్ అన్నారు. ఆత్మాభిమానం కోసం తెలంగాణ ఉద్యమం చేశామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఒక్కరోజూ ధర్నా చేయని, జెండా పట్టని, తెలంగాణ గురించి మాట్లాడని ఇతర పార్టీల పెద్దలకు ప్రధాన పదవులు ఇచ్చి.. ఉద్యమకారులను టీఆర్ఎస్ పార్టీ దూరంపెట్టడం బాధాకరమని స్వామి గౌడ్ ఆవేధన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో సీఎం కేసీఆర్ను కనీసం 100 సార్లు అపాయింట్మెంట్ అడిగానని, ప్రతీసారి రేపు కలుద్దామనే సమాచారం వచ్చేదని, రెండేళ్లలో ఆ రేపు ఎన్నడూ రాలేదని స్వామి గౌడ్ వాపోయారు. ఉద్యమంలో పనిచేసిన వారికి అవమానం జరుగుతున్నది వాస్తవమని, టీఆర్ఎస్ లోనూ అవమానపడుతున్నవారు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.