50 శాతం మించని గ్రేటర్ ఎన్నికల పోలింగ్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ సారి కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం 50 శాతం మించలేదు. ఈ సారి గ్రేటర్ లో పోలింగ్ 45.71 శాతంగా నమోదైంది. 2002 ఎన్నికల్లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఇప్పుడు 45.71 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో 50 శాతానికి మించి పోలింగ్ నమోదైంది. దానితో పోల్చినా.. ప్రస్తుతం పోలింగ్ తక్కువేనని చెప్పవచ్చు. గ్రేటర్ లో పోలింగ్ శాతం తగ్గడానికి చాలా కారణాలు చెబుతున్నారు. డబ్బులు తీసేసుకోండి.. కానీ, మీరు పోలింగ్ కేంద్రాలకు రావక్కర్లేదని కొన్నిచోట్ల అభ్యర్థులు ఓటర్లకు చెప్పారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈసారి పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు పెరగడానికి, ఘర్షణలు జరగడానికి అవకాశం ఉందనే ప్రచారం కూడా ఓటర్లు కేంద్రాలకు దూరంగా ఉండడానికి కారణమని తెలుస్తోంది.