సీఎం విజయ్‌తో విడాకుల కేసు ఉపసంహరించుకున్న సంగీత
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆయన నుంచి విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను భార్య సంగీత స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ కేసును చెంగల్‌పట్టు జిల్లా కోర్టు ముగిస్తున్నట్లు ప్రకటించింది.
కేసు విచారణ సందర్భంగా సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరై, పిటిషన్‌ను కొనసాగించబోనని తెలిపినట్లు సమాచారం. ఆమె నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును క్లోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే భవిష్యత్తులో కొత్త పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛ కూడా ఆమెకు కల్పించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్‌పై పలు ఆరోపణలు చేస్తూ సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే కేసు విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ పలుమార్లు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరై పరిస్థితులను వివరించడంతో అనంతర విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించారు.
చివరికి సంగీత తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడింది. 1999 ఆగస్టు 25న విజయ్, సంగీత వివాహం చేసుకోగా, వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు ముగియడంతో విజయ్ కుటుంబ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
