సోనియా గాంధీ ఆత్మకథ.. ‘బిలాంగింగ్’లో ఎన్నో విశేషాలు
సోనియా గాంధీ ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ నవంబర్ 10న విడుదల కానుంది. రాజీవ్ గాంధీతో ప్రేమ, వివాహం, కుటుంబ విషాదాలు, రాజకీయ ప్రయాణం వంటి అంశాలను ఇందులో ఆమె ప్రస్తావించనున్నారు.
సోనియా గాంధీ జీవితంలోని వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం త్వరలో పుస్తక రూపంలో పాఠకుల ముందుకు రానుంది. ‘Belonging: A Journey of Love’ పేరుతో ఆమె స్వీయచరిత్ర నవంబర్ 10న విడుదల కానుంది. ఆరు దశాబ్దాల భారతీయ సామాజిక, రాజకీయ మార్పులను తన వ్యక్తిగత అనుభవాల కోణంలో ఆవిష్కరించనున్నట్లు ప్రచురణకర్త ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్ ప్రకటించింది.
రాజీవ్‌తో తొలి పరిచయం నుంచి..
ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ.. కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న సమయంలో రాజీవ్ గాంధీని కలిశారు. అప్పటినుంచి వారి పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీసిన విషయాలను ఆమె ఆత్మకథలో ప్రస్తావించారు. తన బాల్యం, ఇటలీ నుంచి భారత్‌కు రావడం, కొత్త సంస్కృతికి అలవాటు పడిన అనుభవాలను కూడా పంచుకోనున్నారు.
కుటుంబంలో వరుస విషాదాలు..
ఇందిరాగాంధీ హత్య, ఆ తర్వాత రాజీవ్‌గాంధీ హత్య తన జీవితాన్ని ఎంతగా మార్చాయో సోనియా గాంధీ పుస్తకంలో వివరించనున్నారు. వ్యక్తిగత విషాదాలే తనను రాజకీయాల వైపు నడిపించాయని ఆమె పేర్కొన్నారు.
ప్రధాని పదవిని ఎందుకు వద్దన్నారు?
కాంగ్రెస్‌లో కీలక నాయకురాలిగా ఎదిగిన సోనియా గాంధీ.. పార్టీ ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ దాన్ని తిరస్కరించారు. తన రాజకీయ ప్రయాణం, ఆ నిర్ణయం వెనుక ఉన్న పరిస్థితులు, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వంతో తన అనుబంధం వంటి అంశాలు కూడా ఈ పుస్తకంలో కీలకంగా ఉండనున్నాయి.
ప్రేమ.. విషాదం.. రాజకీయ ప్రయాణం
సోనియా గాంధీ తన ఆత్మకథను కేవలం రాజకీయ జీవిత చరిత్రగా కాకుండా.. తన కుటుంబం, ప్రేమ, నష్టాలు, విధేయత, భారతదేశంతో తన అనుబంధం చుట్టూ అల్లుకున్న వ్యక్తిగత కథగా పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలుగా తాను చూసిన భారతదేశ మార్పులకు కూడా ఇందులో స్థానం కల్పించారు.
