మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి.

Bristi Mukherjee Ghata, niece of former West Bengal CM Mamata Banerjee, died under suspicious circumstances in Rampurhat. Police have begun an investigation

మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి.

పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు బృష్టి ముఖర్జీ ఘటక్‌ (28) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. రాంపూర్‌హట్‌లోని తన నివాసంలో మంగళవారం ఆమె మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. బృష్టి ముఖర్జీ కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భర్తతో విడాకుల కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నట్లు వారు వెల్లడించారు. ఈ కారణంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నట్లు కథనంలో ఉంది.

ఆస్పత్రికి తరలించేలోపే..
మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఆమెను కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో వెలుగుచూసే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

గతంలో ఉద్యోగ నియామకంపై ఆరోపణలు
బృష్టి ముఖర్జీ పేరు గతంలో పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న ఉద్యోగ నియామకాల వివాదంలోనూ వినిపించింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ నియామకాల్లో బృష్టి కూడా అక్రమంగా ఉద్యోగం పొందారనే ఆరోపణలు వచ్చినట్లు కథనంలో పేర్కొన్నారు. అనంతరం ఆ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆమె ఉద్యోగాన్ని కోల్పోయినట్లు సమాచారం.

ప్రస్తుతం బృష్టి ముఖర్జీ మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె మృతికి అసలు కారణం ఏమిటన్నది అధికారిక దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.