పరందూర్‌ ఎయిర్‌పోర్టుపై రాజకీయ రగడ.. విజయ్‌పై స్టాలిన్‌ ఫైర్‌

పరందూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును రద్దు చేయడంపై తమిళనాడు సీఎం విజయ్‌పై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తీవ్ర విమర్శలు చేశారు

పరందూర్‌ ఎయిర్‌పోర్టుపై రాజకీయ రగడ.. విజయ్‌పై స్టాలిన్‌ ఫైర్‌

తమిళనాడులో చెన్నై రెండో విమానాశ్రయం విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరందూర్‌లో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును సీఎం విజయ్‌ ప్రభుత్వం రద్దు చేయడంతో.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు. ప్రాజెక్టును పక్కనపెట్టడం రాష్ట్ర అభివృద్ధిని ఏళ్ల వెనక్కి నెట్టే నిర్ణయమని విమర్శించారు. 

పరందూర్‌కు బదులు కొత్త ప్రాంతం
చెన్నై పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, పారిశ్రామిక అవసరాలు, కార్గో రవాణా దృష్ట్యా రెండో విమానాశ్రయం అవసరమని సీఎం విజయ్‌ స్పష్టం చేశారు. అయితే పరందూర్‌లో విమానాశ్రయం నిర్మిస్తే వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలు, స్థానికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావించింది. అక్కడి పరిస్థితులపై నిపుణులతో సమగ్ర అధ్యయనం నిర్వహించి.. ప్రజలపై తక్కువ ప్రభావం ఉండే మరో ప్రాంతాన్ని ఎంపిక చేస్తామని విజయ్‌ అసెంబ్లీలో ప్రకటించారు. 

స్టాలిన్‌ తీవ్ర విమర్శలు
విజయ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంకే స్టాలిన్‌ తప్పుబట్టారు. డీఎంకే ప్రభుత్వం హయాంలో రూపొందించిన ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని గుర్తుచేశారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ, పలు అనుమతులు ముందుకు వెళ్లిన సమయంలో ప్రాజెక్టును రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను రాజకీయ కారణాల కోసం తాకట్టు పెట్టలేమని స్టాలిన్‌ మండిపడ్డారు. పరందూర్‌ ప్రాజెక్టు రద్దుతో తమిళనాడు అభివృద్ధి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

యువత ఉపాధిపైనా ప్రభావం- స్టాలిన్‌
ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ వంటి రంగాల్లో తమిళనాడు ముందంజలో ఉందని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచస్థాయి విమానాశ్రయం అవసరమని.. ప్రాజెక్టు రద్దు నిర్ణయం యువత ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇది జాక్‌పాట్‌గా మారుతుందని వ్యాఖ్యానించారు.

విజయ్‌ వాదన ఇదీ..
మరోవైపు.. విమానాశ్రయ అభివృద్ధికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని విజయ్‌ స్పష్టం చేశారు. చెన్నైకి కొత్త విమానాశ్రయం అవసరమేనని.. కానీ వ్యవసాయ భూములు, ప్రజల నివాస ప్రాంతాలకు తక్కువ నష్టం జరిగేలా కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల ఆధ్వర్యంలో సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహించి కొత్త స్థలాన్ని ఖరారు చేస్తామని చెప్పారు. 

ప్రాజెక్టు చరిత్ర కూడా కీలకమే
పరందూర్‌ విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇప్పటికే ఇన్‌-ప్రిన్సిపల్‌ అప్రూవల్‌ ఇచ్చింది. అంతకుముందు సైట్‌ క్లియరెన్స్‌ కూడా లభించింది. దీంతో ప్రాజెక్టును రద్దు చేసి కొత్త ప్రాంతం నుంచి మళ్లీ ప్రక్రియ మొదలుపెట్టడం ఎంత సమయం తీసుకుంటుందన్న అంశంపైనా చర్చ మొదలైంది. 

అభివృద్ధి వర్సెస్‌ పర్యావరణం, ప్రజల జీవనోపాధి.. ఈ రెండు అంశాల మధ్య తమిళనాడులో పరందూర్‌ ఎయిర్‌పోర్టు ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారింది. విజయ్‌ నిర్ణయాన్ని స్టాలిన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ప్రత్యామ్నాయ స్థలంలో విమానాశ్రయం నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది.