దేశ ప్రజలారా.. మోదీ చెప్పిన ఆ మూడు మాటలు గుర్తుంచుకోండి

Prime Minister Narendra Modi highlights India’s 7.8% growth and urges citizens to buy local products, avoid unnecessary foreign trips and gold purchases.

దేశ ప్రజలారా.. మోదీ చెప్పిన ఆ మూడు మాటలు గుర్తుంచుకోండి

భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి తన సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని.. స్వావలంబన దిశగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన మూడు అంశాలను మరోసారి గుర్తుచేశారు. ప్రస్తుతం కిర్గిస్థాన్‌ పర్యటనలో ఉన్న మోదీ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత ప్రజల సంకల్పం, కృషికి 7.8 శాతం వృద్ధిరేటు నిదర్శనమని అన్నారు.

మోదీ చెప్పిన మూడు అంశాలివే..

1. స్వదేశీ వస్తువులనే కొనండి
స్థానికంగా తయారైన వస్తువులు, సేవలకు ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.

2. విదేశీ పర్యటనలకు దూరంగా ఉండండి
అవసరం లేని విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని మోదీ కోరారు. ముఖ్యంగా విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు బదులుగా భారత్‌లోనే వివాహ వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలోనే పర్యాటకం, వివాహాలు, వినియోగం పెరిగితే దేశీయ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

3. అవసరం లేకపోతే బంగారం కొనొద్దు
అవసరం లేకుండా బంగారం కొనుగోలు చేయడం మానుకోవాలని ప్రధాని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సంపదను ఉత్పాదక రంగాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని ఆయన సందేశం ఇచ్చారు.

ప్రపంచ సంక్షోభాల మధ్య 7.8 శాతం వృద్ధి
ప్రపంచం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ అన్నారు. యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసుల్లో అంతరాయాలు, ఇంధన సరఫరాపై ప్రభావం వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయని పేర్కొన్నారు.

కొవిడ్‌ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం పూర్తిగా తిరిగి రాలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ వృద్ధి సాధించడం ప్రజల సామర్థ్యానికి నిదర్శనమని ప్రధాని అన్నారు.

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా..
భారత్‌ స్వావలంబనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజల ఐక్యత, సమష్టి కృషితో భారత్‌ స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

140 కోట్ల మంది భారతీయుల ఐక్యత దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు. తాజా వృద్ధిరేటును కేవలం ఒక ఆర్థిక గణాంకంగా కాకుండా.. దేశ ప్రజల కృషికి లభించిన ఫలితంగా చూడాలని మోదీ పేర్కొన్నారు.