నాగేందర్ గౌడ్, రాకేష్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ. వరంగల్-ఖమ్మం-నల్గొండకు రాకేష్ రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌కు నాగేందర్ గౌడ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
నాగేందర్ గౌడ్, రాకేష్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్?
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల వేడి మొదలైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. బీఆర్ఎస్‌లో మాత్రం అభ్యర్థుల ఎంపికపై చివరి దశ కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీలో రెండు పేర్లు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి అనుగుల రాకేష్ రెడ్డి.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి జి. నాగేందర్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
నాగేందర్ గౌడ్ వైపే బీఆర్ఎస్ చూపు?
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం బీసీ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోంది. ఈ రేసులో జి. నాగేందర్ గౌడ్ పేరు మరోసారి ముందుకు వచ్చింది. బీసీ సామాజిక సమీకరణంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ఆయనకు ఉన్న రాజకీయ పరిచయాలు టికెట్ రేసులో ఆయనకు అనుకూల అంశాలుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు నాగేందర్ గౌడ్ పేరు ఖరారైనట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం.
రాకేష్ రెడ్డికే మరోసారి అవకాశం?
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అనుగుల రాకేష్ రెడ్డి పేరు గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రాకేష్ రెడ్డి.. మరోసారి బరిలోకి దింపాలని పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ఇటీవల వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పార్టీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించినట్లు, ఈ సమావేశంలో రాకేష్ రెడ్డి పేరుపై దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
