తిరుమల భక్తులకు అలర్ట్‌.. అక్టోబర్‌ 7న రూ.300 దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆరు తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్‌ 7న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

తిరుమల భక్తులకు అలర్ట్‌.. అక్టోబర్‌ 7న రూ.300 దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్‌ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్‌ 7న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

అక్టోబర్‌ 7న ఉదయం 10 గంటలకు టికెట్లు
నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో టీటీడీ దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. అక్టోబర్‌ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. భక్తులు అధికారిక వెబ్‌సైట్‌ [ttdevasthanams.ap.gov.in](https://ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలపై ఆంక్షలు
అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం చివరి వారం నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రోటోకాల్‌ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు, రక్షణ శాఖ సిబ్బందికి సంబంధించిన ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సిఫార్సు లేఖలు స్వీకరించరు
వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సంబంధించి అక్టోబర్‌ 10 నుంచి 19 వరకు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల రద్దీని నియంత్రించి, దర్శన ఏర్పాట్లు సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. కాబట్టి తిరుమల యాత్రకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న భక్తులు టికెట్ల విడుదల సమయాన్ని గమనించి, అధికారిక వెబ్‌సైట్‌ ద్వారానే ముందస్తు బుకింగ్‌ చేసుకోవడం మంచిది.