ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట ఎలా?

ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు పరీక్ష జరిగే రోజే ఏఐ సాయంతో పేపర్‌ రూపొందించే విధానాన్ని నందన్‌ నీలేకని ప్రతిపాదించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట ఎలా?

దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీల సమస్యకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం కనుగొనే దిశగా కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ముందుగానే ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి భద్రపరచడానికి బదులుగా.. పరీక్ష జరిగే రోజే కృత్రిమ మేధ (AI) సహాయంతో ప్రశ్నపత్రాన్ని రూపొందించే విధానాన్ని పరిశీలించవచ్చని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని సూచించారు. ఈ విధానం అమల్లోకి వస్తే పరీక్షల నిర్వహణలో భద్రతను మరింత పెంచే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

దిల్లీలో జరిగిన ‘బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌ 2026’ కార్యక్రమంలో నీలేకని ఈ అంశాలపై మాట్లాడారు. భారీ ప్రశ్నల బ్యాంక్‌ నుంచి పరీక్షకు అవసరమైన ప్రశ్నలను ఎంపిక చేసి చివరి నిమిషంలో ప్రశ్నపత్రాన్ని రూపొందించడం ద్వారా లీకేజీల ముప్పును తగ్గించవచ్చనే ఆలోచనను ఆయన ప్రస్తావించారు.

పరీక్ష రోజే ఏఐతో పేపర్‌ తయారీ
సాధారణంగా పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలను రూపొందించి, నిర్దిష్ట భద్రతా విధానాల ద్వారా వాటిని పరీక్ష కేంద్రాలకు చేరవేస్తుంటారు. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడైనా భద్రతా లోపాలు తలెత్తితే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రశ్నల బ్యాంక్‌ ఆధారంగా పరీక్ష జరిగే రోజే పేపర్‌ను రూపొందించే విధానం ఉపయోగపడవచ్చని నీలేకని అభిప్రాయపడ్డారు. పరీక్ష జరిగే రోజే కృత్రిమ మేధతో ప్రశ్నపత్రాన్ని రూపొందించడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఇలాంటి విధానం విజయవంతం కావాలంటే ప్రశ్నల నాణ్యత, సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నల ఎంపిక, కఠినత స్థాయి, సమాన అవకాశాలు, సాంకేతిక భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల వైపు అడుగులు
పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావడానికి అన్ని పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలుగా (CBT) మార్చే అంశాన్ని కూడా తమ కమిటీ పరిశీలిస్తోందని నీలేకని తెలిపారు. పరీక్షల వ్యవస్థలో సమస్యలు తలెత్తిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. వాటికి కారణమవుతున్న లోపాలను గుర్తించి వ్యవస్థాగత మార్పులు తీసుకురావడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ తరహా సంస్కరణలకు సాంకేతిక పరిజ్ఞానం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్దఎత్తున సాంకేతికతను అమలు చేస్తున్నప్పుడు అది సమాజంలోని అన్ని వర్గాలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశంపై తాను దృష్టి సారిస్తానని తెలిపారు.

ప్రధాని ఆసక్తిగా ఉన్నారన్న నీలేకని
పరీక్షల సంస్కరణలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తోందని నీలేకని వెల్లడించారు. కమిటీ సూచనలను అమలు చేయడంపై ప్రధాని ఆసక్తిగా ఉన్నారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపడంతో పాటు, పరీక్షల నిర్వహణపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ప్రశ్నపత్రాల రూపకల్పన, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలపై ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ విధానాల అమలుకు సంబంధించి తుది నిర్ణయాలు, మార్గదర్శకాలు, అమలు గడువు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది. ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.