బ్రెజిల్‌ అడవుల్లో ‘దోమ’ వేట.. 16 హత్యల తర్వాత చిక్కిన సీరియల్‌ కిల్లర్‌

బ్రెజిల్‌లో మూడు నెలల్లో 16 మందిని హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీరియల్‌ కిల్లర్‌ జొర్లాన్‌ లోప్స్‌ డ సిల్వాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళ వేషంలో దాక్కున్నట్లు అధికారులు తెలిపారు.

బ్రెజిల్‌ అడవుల్లో ‘దోమ’ వేట.. 16 హత్యల తర్వాత చిక్కిన సీరియల్‌ కిల్లర్‌

బ్రెజిల్‌లో సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసులో ఎట్టకేలకు కీలక నిందితుడు పోలీసులకు చిక్కాడు. మూడు నెలల్లో ఏకంగా 16 మందిని హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 ఏళ్ల జొర్లాన్‌ లోప్స్‌ డ సిల్వాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యల తర్వాత దట్టమైన అడవుల్లోకి పారిపోతూ.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా అమ్మాయి వేషంలోకి మారడం ఈ కేసులో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

శివారు ప్రాంతాలే టార్గెట్‌..
ఈశాన్య బ్రెజిల్‌లోని పరైబా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో జొర్లాన్‌ వరుస హత్యలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శివారు ప్రాంతాల్లో నివసించే వారినే అతడు లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. హత్య చేసిన వెంటనే అడవుల్లోకి పారిపోవడం అతడికి అలవాటుగా మారిందని పోలీసులు చెబుతున్నారు.

15 గంటల ఆపరేషన్‌.. అడవుల్లో జల్లెడ..
జొర్లాన్‌ కోసం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. దట్టమైన అడవుల్లో సుమారు 15 గంటల పాటు గాలింపు చేపట్టి.. అతడి కదలికలను గుర్తించారు. చివరకు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ‘మేకోవర్‌’..
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు జొర్లాన్‌ మహిళగా వేషం మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళల దుస్తులు ధరించడంతో పాటు విగ్గు, నెయిల్‌పాలిష్‌ కూడా ఉపయోగించినట్లు వెల్లడించారు. రూపం మార్చుకుని జనాల్లో కలిసిపోవడమే అతడి ప్లాన్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

‘మస్కిటో’.. ఎందుకంటే?
జొర్లాన్‌కు స్థానిక క్రిమినల్‌ గ్యాంగ్‌లతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలోనూ పలు హత్యలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇక అతడి శరీరాకృతి కారణంగా స్థానికులు జొర్లాన్‌ను ‘మస్కిటో’ అంటే దోమ అని పిలిచేవారని పోలీసులు వెల్లడించారు. మూడు నెలలు.. 16 హత్యల ఆరోపణలు.. అడవుల్లోకి పరార్‌.. ఆపై పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మహిళ వేషం.. చివరకు ప్రత్యేక ఆపరేషన్‌లో అరెస్ట్‌.. బ్రెజిల్‌లో ‘మస్కిటో’ కథ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.