20 నిమిషాల్లో 7 పేలుళ్లు..దుబాయ్‌లో తీవ్ర కలకలం
యూఏఈ (UAE)లోని దుబాయ్ (Dubai) నగరం వరుస పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జెబెల్ అలీ (Jebel Ali) పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి వరుసగా భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఏడు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
పేలుళ్ల అనంతరం పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో కప్పుకుపోయాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాశ్రయాల్లో ఒకటైన జెబెల్ అలీ పోర్ట్ (Jebel Ali Port) ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. ఓడరేవు సమీపంలోని ఇంధన నిల్వ, రవాణా గిడ్డంగిలో (Fuel Storage Facility) మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తినష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
ఈ పేలుళ్ల వెనుక హూతీ (Houthi) మిలిటెంట్ల హస్తం ఉండొచ్చని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. యెమెన్ నుంచి క్షిపణి దాడులు జరిగాయని ఇరాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు యూఏఈ ప్రభుత్వం (UAE Government) అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
