గాయం నుంచి కోలుకుంటున్న రష్మిక.. దేవుడే బలవంతంగా బ్రేక్ ఇచ్చాడేమో

గాయం నుంచి కోలుకుంటున్న రష్మిక.. దేవుడే బలవంతంగా బ్రేక్ ఇచ్చాడేమో

'మైసా' (Mysaa) సినిమా షూటింగ్‌లో గాయపడిన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో స్పందించిన రష్మిక.. గాయం తీవ్రంగా లేదని, కోలుకునే దిశగా ఉన్నానని వెల్లడించారు.

"గాయపడిన విషయం బయటకు రావాలని నేను అనుకోలేదు. కానీ కొన్ని రోజులుగా అందరికీ దూరంగా ఉండటంతో విషయం తెలిసిపోయింది. ఇది నాకు వరుసగా మూడో గాయం. ఇకపై నా శరీరాన్ని యంత్రంలా కాకుండా, మరింత జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఆమె తెలిపారు.

తనకు హిప్ (Hip) కుడివైపు ఉన్న టెండన్ (Tendon) దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారని, అది పూర్తిగా కోలుకున్న తర్వాతే మామూలుగా నడవగలనని రష్మిక వెల్లడించారు. "నేను స్వచ్ఛందంగా ఎప్పుడూ విశ్రాంతి తీసుకోను కాబట్టి.. దేవుడే బలవంతంగా నాకు బ్రేక్ ఇచ్చాడేమో అనిపిస్తోంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఖాళీ సమయాన్ని పజిల్స్ (Puzzles) ఆడుతూ గడుపుతున్నానని, అయితే వ్యాయామం చేయలేకపోవడంతో బరువు పెరుగుతానేమో అన్న భయం ఉందని చెప్పారు. ముఖ్యంగా స్వీట్లు కనిపిస్తే ఆగలేకపోతున్నానంటూ అభిమానులతో సరదాగా తన అనుభవాన్ని పంచుకున్నారు.

చివరగా.. "నాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. అందరికీ నా ప్రేమాభివందనాలు" అంటూ అభిమానులకు రష్మిక భరోసా ఇచ్చారు.