మెటా నిర్వహణపై విమర్శలు.. క్షమాపణ చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్
మెటా (Meta) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సంస్థ నిర్వహణలో జరిగిన పలు లోపాలపై క్షమాపణ తెలిపారు. ముఖ్యంగా డీప్‌ఫేక్ (Deepfake) వీడియోల వ్యాప్తి, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM) నియంత్రణలో ఎదురైన వైఫల్యాలు, ప్లాట్‌ఫామ్ మోడరేషన్‌కు సంబంధించిన సమస్యలను అంగీకరించినట్లు సమాచారం.
అంతకుముందు మెటా ప్రతినిధులు కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ (MeitY) అధికారులతో సమావేశమయ్యారు. ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ (S. Krishnan) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ (Chief Global Affairs Officer) జోయెల్ కాప్లన్ (Joel Kaplan)తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి సంబంధించిన 'జెన్ జీ' (Gen Z) అవుట్‌రీచ్ వీడియో తొలగింపుపై కేంద్రం వివరణ కోరినట్లు తెలుస్తోంది. అలాగే అభ్యంతరకర కంటెంట్‌ను నియంత్రించడంలో మెటా అనుసరిస్తున్న విధానాలపై కూడా అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
ఈ భేటీ అనంతరం మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వినియోగదారుల భద్రత, అభ్యంతరకర కంటెంట్ నియంత్రణ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని మెటా హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
