ట్రంప్‌తో ఫొటోకు రూ.85 లక్షలా? అమెరికాలో హాట్ టాపిక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫొటో దిగేందుకు 88,600 డాలర్లు అంటే దాదాపు రూ.85 లక్షలు వసూలు చేస్తున్నారన్న ఆహ్వాన వివరాలు వైరల్‌గా మారాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఓ ఫొటో దిగాలంటే ఎంత ఖర్చవుతుంది? సాధారణంగా ఊహించలేని మొత్తం చెల్లించాల్సి వస్తుందట. హ్యూస్టన్‌లో ఆగస్టు 27న జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కమిటీ నిధుల సేకరణ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానంలో భారీ మొత్తాలు కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
ఫొటోకు భారీ రేట్..
వైరల్ అవుతున్న ఆహ్వాన వివరాల ప్రకారం.. ట్రంప్‌తో గ్రూప్ ఫొటో దిగేందుకు 88,600 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.85 లక్షలు. అంటే ట్రంప్‌తో ఒక్క ఫొటో కోసం దాదాపు ఓ లగ్జరీ కారు విలువైన మొత్తాన్ని చెల్లించాల్సిందే అన్నమాట. అయితే ఈ మొత్తం సాధారణ టికెట్ ధర కాదు. ఇది నిధుల సేకరణ కార్యక్రమంలో అందించే ప్రత్యేక ఫొటో ప్యాకేజీకి సంబంధించిన మొత్తం.
జంటకు రూ.9.5 లక్షల నుంచి..
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాధారణ టికెట్ ధర కూడా భారీగానే ఉంది. ఆహ్వానం ప్రకారం ఒక జంటకు 10 వేల డాలర్ల నుంచి ప్యాకేజీలు ప్రారంభమవుతున్నాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.9.5 లక్షలు. ఇక ట్రంప్‌తో గ్రూప్ ఫొటో అవకాశం ఉన్న ప్యాకేజీకి ఏకంగా 88,600 డాలర్ల ధరను నిర్ణయించినట్లు సమాచారం.
హోస్ట్ కమిటీ ప్యాకేజీ మరింత ఖరీదు..
ఇక్కడితో ఆగలేదు. అత్యంత ఖరీదైన హోస్ట్ కమిటీ ప్యాకేజీ విలువ 4,43,000 డాలర్లుగా పేర్కొనబడింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.4.2 కోట్లు. అమెరికా రాజకీయాల్లో నిధుల సేకరణ కార్యక్రమాలు కొత్తేమీ కాకపోయినా.. అధ్యక్షుడితో ఫొటో కోసం ఇంత భారీ మొత్తాన్ని చెల్లించాల్సి రావడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమవుతోంది.
అసలు కార్యక్రమం ఎందుకంటే..
హ్యూస్టన్‌లో జరగనున్న ఈ కార్యక్రమం రిపబ్లికన్ నేషనల్ కమిటీకి నిధులు సమీకరించే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. రానున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ భారీగా నిధులు సమీకరిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందులో భాగంగా ట్రంప్ హాజరయ్యే కార్యక్రమానికి వివిధ స్థాయిల్లో విరాళాలు, ప్యాకేజీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ట్రంప్‌తో ఫొటోకు సంబంధించిన భారీ మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
