రాయదుర్గం భూమికి మైండ్‌బ్లోయింగ్‌ రేటు.. ఎకరాకు రూ.264 కోట్లు

హైదరాబాద్‌ రాయదుర్గం పాన్‌మక్తాలో టీజీఐఐసీ నిర్వహించిన ఈ-వేలంలో ఎకరా భూమి రూ.264 కోట్లకు అమ్ముడైంది. 5.25 ఎకరాలను MSN Realty దక్కించుకుంది.

రాయదుర్గం భూమికి మైండ్‌బ్లోయింగ్‌ రేటు.. ఎకరాకు రూ.264 కోట్లు

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో సంచలనం నమోదైంది. రాయదుర్గం పాన్‌మక్తాలో భూమి ధర మరోసారి ఆకాశాన్నంటింది. టీజీఐఐసీ నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. దీంతో కొద్ది నెలల క్రితం నమోదైన రూ.237 కోట్ల రికార్డును కూడా ఈ వేలం అధిగమించింది. 

5.25 ఎకరాలకు భారీ బిడ్‌
రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నంబర్‌ 83/1లో 5.25 ఎకరాల భూమిని టీజీఐఐసీ వేలానికి పెట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్‌ ధర ఎకరాకు రూ.175 కోట్లు. భారీ విలువైన భూమి కావడంతో పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు బిడ్డింగ్‌లో పోటీపడ్డాయి. చివరకు MSN Realty అత్యధిక బిడ్‌ వేసి మొత్తం 5.25 ఎకరాలను దక్కించుకున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. 

గత రికార్డు కూడా ఇదే ప్రాంతంలో..
రాయదుర్గం భూములకు ఉన్న డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో తాజా వేలం మరోసారి నిరూపించింది. ఇదే ప్రాంతంలో మే నెలలో జరిగిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్లు పలికింది. అప్పట్లో ఆ ధర హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో సంచలనంగా మారింది. ఇప్పుడు అదే ప్రాంతంలో రూ.264 కోట్ల బిడ్‌తో కొత్త రికార్డు నమోదైంది. 

రూ.1,300 కోట్లకు పైగా విలువ
ఎకరాకు రూ.264 కోట్ల చొప్పున 5.25 ఎకరాలకు లెక్కిస్తే.. మొత్తం విలువ సుమారు రూ.1,386 కోట్లు అవుతుంది. అంటే కేవలం 5.25 ఎకరాల భూమి కోసం వెయ్యి కోట్లకు పైగా వెచ్చించినట్టే.

రాయదుర్గానికి ఎందుకింత డిమాండ్‌?
హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ పరిధిలోని రాయదుర్గం.. ఐటీ, కమర్షియల్‌ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ కనెక్టివిటీతో పాటు చుట్టుపక్కల భారీ కార్పొరేట్‌ అభివృద్ధి ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్‌ భారీగా పెరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఎకరాకు రూ.177 కోట్లు, ఆ తర్వాత రూ.237 కోట్ల స్థాయిలో ధరలు నమోదయ్యాయి. 

రూ.100 కోట్ల ఎకరా ధరే సంచలనం అనుకున్న రాయదుర్గం.. ఇప్పుడు రూ.264 కోట్ల మార్క్‌ను దాటేసింది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఈ వేలం కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది.