కోదాడ వద్ద ఘోర ప్రమాదం.. బస్సు–కంటైనర్ ఢీ.. ఆరుగురి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన బస్సు
హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. దొరకుంట శివారుకు చేరుకున్న సమయంలో రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
42 మంది ప్రయాణికులు
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో.. వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
