వారి ట్రాప్‌లో పడొద్దు.. సోషల్‌ మీడియాపై పవన్‌ కీలక దిశానిర్దేశం

సోషల్‌ మీడియా, ప్రసార మాధ్యమాల్లో పార్టీ శ్రేణులు ఎలా వ్యవహరించాలనే దానిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక సూచనలు చేశారు.

వారి ట్రాప్‌లో పడొద్దు.. సోషల్‌ మీడియాపై పవన్‌ కీలక దిశానిర్దేశం

జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కీలక సూచనలు చేశారు. సోషల్‌ మీడియా, ప్రసార మాధ్యమాల్లో పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలు వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అనవసర విషయాలపై ఆవేశంగా స్పందించడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, అసభ్య పదజాలం ఉపయోగించడం వంటి వాటికి దూరంగా ఉండాలని పవన్‌ సూచించారు. ఏ అంశంపైనైనా పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పందించాలని స్పష్టం చేశారు.

వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలి
సోషల్‌ మీడియాలో వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లొద్దని పవన్‌ సూచించారు. ముఖ్యంగా మహిళల విషయంలో గౌరవంగా మాట్లాడాలని చెప్పారు. పార్టీ అంతర్గత అంశాలను సోషల్‌ మీడియా వేదికగా ఇష్టానుసారం చర్చించవద్దని స్పష్టం చేశారు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని పవన్‌ హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా, జనసైనికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాజకీయ ప్రత్యర్థుల ట్రాప్‌లో పడొద్దు
రాజకీయ ప్రత్యర్థులు సోషల్‌ మీడియా ద్వారా చేసే ప్రచారానికి ఆకర్షితులు కావద్దని పవన్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నాలను గుర్తించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం స్ఫూర్తిని దెబ్బతీయకుండా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించిన పవన్‌.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని చెప్పారు. పార్టీ అభ్యున్నతితో పాటు కష్టపడి పనిచేస్తున్న జనసైనికుల సంక్షేమం కూడా తమ దృష్టిలో ఉందని పవన్‌ పేర్కొన్నారు.