ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పిన బాలిక తల్లి

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పిన బాలిక తల్లి

పేపర్ లీక్ (Paper Leak) నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో క్షమాపణలు చెప్పిన నోయిడా (Noida) బాలిక వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తాజాగా ఆమె తల్లి స్పందిస్తూ.. తన కుమార్తెను క్షమించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

"ప్రధాని తీసుకున్న నిర్ణయంతో నా కుమార్తెకు కొత్త జీవితం లభించింది. ఆమె చేసిన తప్పును క్షమించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో.. ఈ క్షమాభిక్షే ఆమెకు అత్యంత విలువైన బహుమతి" అని పేర్కొన్నారు.

అలాగే మైనర్లను సోషల్ మీడియా (Social Media) ద్వారా రెచ్చగొట్టకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తన కుమార్తె వయసు 15 సంవత్సరాలు మాత్రమేనని, అయితే ఎఫ్‌ఐఆర్ (FIR)లో 25 సంవత్సరాలుగా నమోదైందని తెలిపారు. ఆమెపై నమోదైన కేసును ఉపసంహరించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే క్షమాపణలు చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని, ఈ అంశంలో సంబంధిత అధికారులు జోక్యం చేసుకోవాలని కోరారు. మరోవైపు ఆ బాలిక కూడా మరోసారి తాను కొందరి ప్రభావానికి లోనై ప్రధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశానని అంగీకరిస్తూ, మరోసారి క్షమాపణలు తెలిపింది.