పొలంలో కనిపించిన మొసలి.. భుజానేసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రైతు
బిహార్ (Bihar)లో ఓ రైతు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొలంలోకి వచ్చిన మొసలి (Crocodile)ని చాకచక్యంగా బంధించిన రైతు.. దాన్ని భుజానేసుకుని ఏకంగా పోలీస్ స్టేషన్ (Police Station) వరకు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
సుపౌల్ జిల్లా (Supaul District)లో వరి పొలంలో రైతులు పనులు చేస్తుండగా ఒక్కసారిగా మొసలి కనిపించింది. దీంతో అక్కడ భయాందోళన నెలకొంది. అయితే మొసలికి ఎలాంటి హాని చేయకుండా సురక్షితంగా పట్టుకోవాలని రైతులు నిర్ణయించారు.
ఈ క్రమంలో రైతు అమిత్ కుమార్ (Amit Kumar) ధైర్యం ప్రదర్శించాడు. ముందుగా మొసలి నోరును తాళ్లతో బిగించి, అది ఎవరికీ హాని చేయకుండా నియంత్రించాడు. అక్కడి నుంచి తరలించేందుకు వాహనం అందుబాటులో లేకపోవడంతో.. దాదాపు 5 అడుగుల పొడవున్న మొసలిని భుజానేసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు.
సమాచారం అందుకున్న అధికారులు అటవీ శాఖ (Forest Department)కు సమాచారం ఇచ్చారు. అనంతరం మొసలిని స్వాధీనం చేసుకున్న అధికారులు సమీపంలోని నదిలో సురక్షితంగా వదిలిపెట్టారు. రైతు ధైర్యసాహసాలను పలువురు ప్రశంసిస్తుండగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
