మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ ఊపు.. కాంగ్రెస్‌తో కేంద్రం కీలక చర్చలు
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ (Women's Reservation) అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం మరోసారి అడుగులు వేస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ బిల్లును అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రతిపాదనపైనా కేంద్రం ముందుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) బుధవారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో దాదాపు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) కూడా పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు కాంగ్రెస్ సహకారం కోరినట్లు సమాచారం.
అయితే కాంగ్రెస్ తన రెండు ప్రధాన డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన ఘటనపై అమిత్ షా (Amit Shah) పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని, అలాగే అయోధ్య విరాళాల అంశంపై చర్చ జరపాలని రాహుల్ గాంధీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్లు నెరవేరే వరకు బిల్లులపై ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.
ఇక రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రభుత్వం ఇతర విపక్ష పార్టీలతోనూ చర్చలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ (SP), డీఎంకే (DMK) వంటి పార్టీలతో కూడా సంప్రదింపులు జరపాలని భావిస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచే ప్రతిపాదనపై కూడా కేంద్రం పరిశీలన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ అంశాలపై పార్లమెంట్‌లో మరోసారి విస్తృత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
