తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని సాయం కోరిన సీఎం
తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి (Tummidihetti) బ్యారేజీతో పాటు నాలుగు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి (Jal Shakti Minister) సీఆర్ పాటిల్ (C.R. Patil), పర్యావరణ శాఖ మంత్రి (Environment Minister) భూపేందర్ యాదవ్ (Bhupender Yadav)తో వేర్వేరుగా సమావేశమై వినతిపత్రాలు అందజేశారు.
ప్రాణహిత (Pranahita) నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఎత్తును 150–152 మీటర్ల వరకు పెంచేందుకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు.
తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్లు, 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణంపై నిర్వహించిన అధ్యయనంలో ముంపు ప్రభావంలో పెద్దగా తేడా లేదని వెల్లడైందని సీఎం గుర్తు చేశారు. గ్రావిటీ ద్వారా సమృద్ధిగా నీరు అందాలంటే ఎత్తు పెంపు అవసరమని కేంద్ర మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి (Palamuru-Rangareddy), గౌరవెల్లి (Gouravelli), సీతమ్మసాగర్ (Seethamma Sagar), డిండి (Dindi) ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని భూపేందర్ యాదవ్‌ను కోరారు. ఇప్పటికే ఈ నాలుగు ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ కేంద్ర అనుమతుల జాప్యంతో పనులు నిలిచిపోయాయని, ప్రాజెక్టుల వ్యయం మరింత పెరుగుతోందని వివరించారు.
సీఎం విజ్ఞప్తిపై స్పందించిన సీఆర్ పాటిల్.. ముందుగా కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చలు ప్రారంభిస్తామని, అనంతరం రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
