తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో నిత్యాన్నధానం .. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు

యాదాద్రి ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం ట్రస్ట్‌ బోర్డు 26 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రోజూ 2 వేల మందికి నిత్యాన్నదానం, వేద పాఠశాల, గోశాల, సోలార్‌ వ్యవస్థ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో నిత్యాన్నధానం .. ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ మొత్తం 26 అంశాలకు ఆమోదం తెలిపింది.

రోజూ 2 వేల మందికి నిత్యాన్నదానం
భక్తులకు నిత్యాన్నదానం అందించే విషయంలో ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ సుమారు 2 వేల మంది భక్తులకు అన్నదానం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో కొండపై దీక్షాపరులు, నిత్యకల్యాణ మండపాల ఏర్పాటుతో పాటు మెట్ల మార్గంలో షెడ్లు నిర్మించాలని నిర్ణయించింది.

వేద పాఠశాల.. గోశాల
ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేసేలా వేద పాఠశాల, గోశాల ఏర్పాటుకు కూడా పాలక మండలి ఆమోదం తెలిపింది. రాయగిరి వద్ద భారీ కమాన్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కొండ చుట్టూ ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద రాతి విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు.. తులసి కాటేజీలో రెండు కల్యాణ కట్టలు నిర్మించనున్నారు.

ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలు
భక్తులకు సేవలను మరింత సులభతరం చేసే దిశగా ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యాలకు ఆన్‌లైన్‌ సదుపాయం కల్పించేందుకు కూడా ఆమోదం లభించింది. ఈ సదుపాయాన్ని టీసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల అవసరాలు, సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు సబ్‌ కమిటీల ఏర్పాటుకూ పాలక మండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్‌ వ్యవస్థ
యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచేలా గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాతల కోసం కొండపై ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేలా ట్రస్ట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలు అమలు కానున్నాయి.