కవితతో విజయ్‌ జ్యోతిష్యుడి భేటీ.. తెలంగాణలో హాట్ టాపిక్

కల్వకుంట్ల కవితను తమిళనాడు సీఎం విజయ్‌కు సన్నిహితంగా ఉండే జ్యోతిష్యుడు రాధన్‌ పండిట్‌ కలవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో జరిగిన భేటీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కవితతో విజయ్‌ జ్యోతిష్యుడి భేటీ.. తెలంగాణలో హాట్ టాపిక్

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చర్చకు దారితీస్తోంది. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితను తమిళనాడుకు చెందిన జ్యోతిష్యుడు రాధన్‌ పండిట్‌ వెట్రివెల్‌ కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. కవిత తన కుమారుడితో కలిసి రాధన్‌ పండిట్‌ను సత్కరించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు భేటీ ఎందుకు?
రాధన్‌ పండిట్‌ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చి కవితను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భేటీకి కారణం ఏంటన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. కవిత ఆహ్వానం మేరకు ఆయన హైదరాబాద్‌కు వచ్చారా? లేక ఆయనే స్వయంగా వచ్చి కలిశారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కవిత తన రాజకీయ భవిష్యత్‌ గురించి రాధన్‌ పండిట్‌తో చర్చించారా? భవిష్యత్‌ రాజకీయ పరిణామాలపై ఏమైనా సలహాలు తీసుకున్నారా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ అంశాలపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు.

విజయ్‌తో రాధన్‌ పండిట్‌కు ప్రత్యేక అనుబంధం
తమిళనాడు సీఎం విజయ్‌తో రాధన్‌ పండిట్‌కు సన్నిహిత సంబంధం ఉన్న విషయం గతంలో వార్తల్లో నిలిచింది. విజయ్‌ రాజకీయంగా ఎదుగుతారని, ముఖ్యమంత్రి అవుతారని ఆయన ముందుగానే అంచనా వేసినట్లు పలు కథనాలు వచ్చాయి. 2026లో విజయ్‌ టీవీకే రాజకీయ విజయంతో రాధన్‌ పండిట్‌ పేరు మరోసారి ప్రముఖంగా వినిపించింది. విజయ్‌ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో రాధన్‌ పండిట్‌ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విధుల అధికారిగా నియమించడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నియామకాన్ని విజయ్‌ వెనక్కి తీసుకున్నారు. 

కవిత కూడా తమిళనాడు మోడల్‌ వైపు?
తమిళనాడు ఎన్నికల సమయంలో విజయ్‌ టీవీకే సాధించిన విజయాన్ని కవిత ప్రశంసించిన విషయం కూడా ప్రస్తావనకు వస్తోంది. పాత రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తులు ఎదగవచ్చనే అంశాన్ని ఆమె అప్పట్లో ప్రస్తావించారు. ఇప్పుడు అదే విజయ్‌కు సన్నిహితంగా ఉన్న జ్యోతిష్యుడు రాధన్‌ పండిట్‌ హైదరాబాద్‌లో కవితను కలవడం ఆసక్తిని పెంచుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కవిత చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఉందా? అన్న చర్చ మొదలైంది.

అయితే రాధన్‌ పండిట్‌-కవిత భేటీ వెనుక అసలు కారణం ఏమిటన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఫొటో మాత్రం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది.