కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. పాక్‌తో పోల్చుకోవడం కాదు, చైనాతో పోటీ పడాలి
పాకిస్థాన్‌తో పోల్చుకుని గొప్పలు చెప్పుకోవడం కాదని, భారత్ అభివృద్ధి కోసం చైనా వంటి దేశాలతో పోటీ పడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యువత, విద్య, ఉపాధి, మౌలిక వసతులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ అభివృద్ధిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కంటే మనం గొప్పగా ఉన్నామని చెప్పుకుంటూ సంతృప్తి చెందడం కాదని.. అసలు మన దేశాన్ని ఎవరితో పోల్చుకోవాలన్నదే ఆలోచించాల్సిన విషయమని అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. 80 ఏళ్ల స్వాతంత్ర్య ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ దేశం సాధించిన ప్రగతితో పాటు ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలను ప్రస్తావించారు. ఇన్ని వైరుధ్యాల మధ్య కూడా కలిసి మెలిసి ఉండటం భారతదేశ గొప్పతనమని చెప్పారు. అయితే స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేసినా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందని పరిస్థితి ఉందని అన్నారు.
మతం కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడాలి
దేశంలో నీళ్లు, విద్యుత్, మౌలిక వసతులకు కొరత లేకపోయినా.. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి అవసరమైనంత నీటి వనరులు ఉన్నాయని, 24 గంటల విద్యుత్ అందించే సామర్థ్యం కూడా ఉందని చెప్పారు.
మతం, ఆహారం, దుస్తులు, ఎవరి దేవుడు గొప్ప అనే అంశాల చుట్టూ రాజకీయాలు సాగడం కంటే.. దేశ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. 80 ఏళ్ల తర్వాత కూడా కుల, మతాల పేరుతో విభేదాలు కొనసాగడం సరైన పరిణామం కాదన్నారు.
చైనాను ఉదాహరణగా ప్రస్తావించిన కేటీఆర్
భారత్‌తో పోలిస్తే నాలుగు దశాబ్దాల క్రితం చైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్నా.. ఇప్పుడు అమెరికాతో పోటీపడే స్థాయికి ఎదిగిందని కేటీఆర్ అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరితే.. భారత్ ఆర్థిక వ్యవస్థ సుమారు 3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉందని పేర్కొన్నారు. జనాభాను దేశానికి ప్రతికూలతగా చూడాల్సిన అవసరం లేదని.. అదే జనాభాను నైపుణ్యం, విద్య, ఉపాధి అవకాశాలతో మానవ వనరుగా మార్చుకోవాలని సూచించారు.
మన పిల్లలు విదేశాలకు ఎందుకు వెళ్లాలి?
దేశంలో సరైన అవకాశాలు లేకపోవడం వల్లే యువత విదేశాలకు వెళ్తోందని కేటీఆర్ అన్నారు. మన దేశంలోనే ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేకపోతున్నామని ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో పోల్చుకుని సంతృప్తి చెందడం కాకుండా.. ప్రపంచంలో ముందున్న దేశాలతో పోటీ పడే స్థాయికి భారత్ ఎదగాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
