వర్షాల కోసం నాగార్జునసాగర్‌లో ప్రత్యేక పూజలకు సీఎం రేవంత్ నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండాలని సంకల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 10న నాగార్జునసాగర్ వద్ద ఈ ప్రత్యేక యాగం జరగనుంది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు సూచించిన ముహూర్తం ప్రకారం నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో వరుణ యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చకులు వేదోక్తంగా యాగక్రతువులు నిర్వహించనున్నారు.
కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని, చెరువులు నిండాలని, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
వరుణ యాగం అనంతరం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారని సీఎం కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది.
