యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానంలో కీలక మార్పులకు దారితీసే 'పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ (సవరణ) బిల్లు-2026'కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో యూపీఐ (UPI) సహా డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు సేవా ఛార్జీలు వసూలు చేసే అవకాశానికి చట్టబద్ధత లభించనుంది.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం యూపీఐ లావాదేవీలు, కొన్ని ఎలక్ట్రానిక్ పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేయడానికి అనుమతి లేదు. కొత్త బిల్లుతో ఆ పరిమితిని తొలగించారు.
లోక్‌సభలో ఈ బిల్లు ఎలాంటి విస్తృత చర్చ లేకుండానే వాయిస్ ఓటు ద్వారా ఆమోదం పొందింది. దీంతో డిజిటల్ చెల్లింపుల సేవలు అందిస్తున్న బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు భవిష్యత్తులో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం ఏర్పడింది.
ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ (RTGS), ఎన్‌ఈఎఫ్‌టీ (NEFT) వంటి బ్యాంకింగ్ లావాదేవీలపై సేవా ఛార్జీలు అమల్లో ఉన్నాయి. అయితే యూపీఐకి ఉన్న ప్రత్యేక మినహాయింపు ఇప్పుడు తొలగించబడింది. కొత్త చట్టం అమలు, ఛార్జీల స్వరూపం, అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం, సంబంధిత నియంత్రణ సంస్థలు ప్రకటించాల్సి ఉంది.
