టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ ఎవరు? నోయల్‌ టాటాకు అదే అడ్డంకి

టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ ఎవరు? నోయల్‌ టాటాకు అదే అడ్డంకి

భారత వ్యాపార రంగంలో ఇప్పుడు అందరి చూపూ టాటా గ్రూప్‌ వైపే. దాదాపు దశాబ్దం పాటు టాటా సన్స్‌కు నాయకత్వం వహించిన ఎన్. చంద్రశేఖరన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగిసిన తర్వాత మరోసారి ఛైర్మన్‌గా కొనసాగబోనని ఆయన ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్‌లో తదుపరి నాయకత్వంపై చర్చ మొదలైంది. 

అయితే టాటా సన్స్‌ కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయడం సాధారణ కంపెనీల్లో జరిగే ప్రక్రియలా ఉండదు. టాటా సన్స్‌ ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌లోని ఆర్టికల్‌ 118 ప్రకారం ప్రత్యేక ఎంపిక ప్రక్రియ ఉంది. టాటా ట్రస్టులు కంపెనీలో నిర్దిష్ట వాటా కలిగి ఉన్నంతకాలం ఛైర్మన్‌ ఎంపిక కోసం సెలెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ సిఫారసు చేసిన వ్యక్తినే బోర్డు ఛైర్మన్‌గా నియమించే ప్రక్రియ ఉంటుంది. 

నోయల్‌ టాటా పేరు ఎందుకు వినిపిస్తోంది?
టాటా ట్రస్టుల ఛైర్మన్‌గా ఉన్న నోయల్‌ టాటా పేరు సహజంగానే తదుపరి ఛైర్మన్‌ చర్చలో ముందుకు వస్తోంది. టాటా గ్రూప్‌ యాజమాన్య నిర్మాణంలో టాటా ట్రస్టులకు ఉన్న ప్రాధాన్యత, టాటా సన్స్‌ బోర్డులో నోయల్‌ టాటా పాత్ర కారణంగా ఆయనకు నిర్ణయాత్మక ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.

కానీ ఇక్కడే ఒక కీలక నిబంధన అడ్డుగా నిలుస్తోంది.
2022లో టాటా సన్స్‌ ఆర్టికల్‌ 118ను సవరించింది. సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ లేదా సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి అదే సమయంలో టాటా సన్స్‌ బోర్డు ఛైర్మన్‌గా ఉండకూడదని ఈ సవరణ స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం టాటా ట్రస్టుల ఛైర్మన్‌గా ఉన్న నోయల్‌ టాటా.. అదే సమయంలో టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాలంటే ప్రస్తుత నిబంధనల్లో మార్పు అవసరం. అందుకే ఆయన పేరు వినిపిస్తున్నప్పటికీ, ప్రస్తుత నిబంధనల ప్రకారం నేరుగా ఆ కుర్చీలో కూర్చోవడం సాధ్యం కాదు.

ట్రస్టులదే కీలక పాత్ర
టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎంపికలో టాటా ట్రస్టుల ప్రభావం చాలా కీలకం. ఆర్టికల్‌ 118 ప్రకారం ఎంపిక కమిటీలో ట్రస్టుల ప్రతినిధులకు ముఖ్యమైన స్థానం ఉంటుంది. కమిటీ సిఫారసు చేసిన అభ్యర్థిని బోర్డు ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఛైర్మన్‌ నియామకానికి సంబంధించి బోర్డులో ట్రస్టుల నామినీ డైరెక్టర్ల మద్దతుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 

టాటా సన్స్‌లో టాటా ట్రస్టుల వాటా కూడా గణనీయమే. పలు నివేదికల ప్రకారం ప్రధాన టాటా ట్రస్టులు, అనుబంధ ట్రస్టులు కలిసి టాటా సన్స్‌లో దాదాపు మూడింట రెండొంతుల వాటాను కలిగి ఉన్నాయి. అందుకే తదుపరి ఛైర్మన్‌ ఎంపికలో ట్రస్టుల అభిప్రాయం అత్యంత కీలకంగా మారనుంది. 

మిస్త్రీ ఎపిసోడ్‌ తర్వాత మారిన లెక్కలు
టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎంపికలో గత అనుభవాల ప్రభావం కూడా ఉంది. 2012లో సైరస్‌ మిస్త్రీ టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆయనను బోర్డు పదవి నుంచి తొలగించిన తర్వాత కొత్త ఛైర్మన్‌ ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రతన్‌ టాటా, వేణు శ్రీనివాసన్‌, అమిత్‌ చంద్ర, రోనెన్‌ సేన్‌, కుమార్‌ భట్టాచార్య సభ్యులుగా ఉన్న కమిటీ ఎన్. చంద్రశేఖరన్‌ పేరును సిఫారసు చేసింది. అనంతరం ఆయన టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత 2022లో ఆర్టికల్‌ 118లో కీలక మార్పు రావడంతో టాటా ట్రస్టులు, టాటా సన్స్‌ నాయకత్వం మధ్య స్పష్టమైన విభజన ఏర్పడింది. ఒకే వ్యక్తి రెండు సంస్థలకు ఛైర్మన్‌గా ఉండకుండా ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 

 ఇప్పుడు అసలు ప్రశ్న.. ఎవరు?
చంద్రశేఖరన్‌ తర్వాత ఎవరు? ఇదే ఇప్పుడు టాటా గ్రూప్‌లో ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం అధికారికంగా తదుపరి ఛైర్మన్‌ పేరు ప్రకటించలేదు. అయితే చంద్రశేఖరన్‌ తన వారసుడి ఎంపికపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు. గ్రూప్‌లో కీలక వ్యాపార ప్రాజెక్టులు కొనసాగుతున్న నేపథ్యంలో 2027 తర్వాత నాయకత్వంపై స్పష్టత అవసరమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 

ఇదే సమయంలో టాటా సన్స్‌, టాటా ట్రస్టుల మధ్య వ్యూహాత్మక అంశాలపై విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. టాటా సన్స్‌ లిస్టింగ్‌, పెట్టుబడులు, కొన్ని నష్టాల్లో ఉన్న వ్యాపారాల భవిష్యత్తు వంటి అంశాలు నాయకత్వ చర్చలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అందుకే తదుపరి ఛైర్మన్‌ ఎంపిక కేవలం ఒక వ్యక్తిని ఎంపిక చేసే వ్యవహారం కాదు. టాటా గ్రూప్‌ భవిష్యత్‌ వ్యూహం, టాటా ట్రస్టుల పాత్ర, బోర్డు గవర్నెన్స్‌.. అన్నింటినీ ప్రభావితం చేసే నిర్ణయంగా మారనుంది.

నోయల్‌ టాటా పేరు బలంగా వినిపిస్తున్నా.. ఆర్టికల్‌ 118 నిబంధన ఆయనకు నేరుగా ఛైర్మన్‌ కుర్చీని దూరం చేస్తోంది. మరి టాటా ట్రస్టులు ఎవరిని ముందుకు తీసుకొస్తాయి? చంద్రశేఖరన్‌ తర్వాత టాటా సన్స్‌ పగ్గాలు ఎవరికి దక్కుతాయి? ఇప్పుడు ఇదే టాటా గ్రూప్‌లో అతిపెద్ద ప్రశ్న.