మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao).. టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)కు లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలు పరువునష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ, వెంటనే వాటిని ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు.

తెలంగాణలో వర్షాలు పడకుండా ఉండాలని హరీశ్ రావు ఆలయాల్లో క్షుద్రపూజలు చేశారంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుడు, నిరాధారమైనవని హరీశ్ రావు తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేశారని ఆరోపించారు.

ఈ తరహా ఆరోపణలు ప్రజాస్వామ్య రాజకీయ చర్చల స్థాయిని దిగజార్చే చర్యలని నోటీసుల్లో ప్రస్తావించారు. ఆలయ దర్శనాలను వక్రీకరించి రాజకీయ విమర్శలకు వాడటం సమంజసం కాదని పేర్కొన్నారు.

ఇప్పటికే ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ (Addanki Dayakar), సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy)లకు కూడా లీగల్ నోటీసులు పంపిన విషయాన్ని హరీశ్ రావు తరఫు న్యాయవాది గుర్తు చేశారు.

తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు, తప్పుడు ఆరోపణలను సరిదిద్దుతూ బహిరంగ ప్రకటన విడుదల చేసి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు నోటీసుల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.