స్కైరూట్ విజయోత్సవంలో సినీ తారలు.. నాగ్, చరణ్ ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ (SpaceTech Startup) స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) ఎనిమిదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు టాలీవుడ్ నటులు అక్కినేని నాగార్జున (Nagarjuna), రామ్ చరణ్ (Ram Charan) హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇటీవల పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1 (Vikram-1)' విజయవంతమైన నేపథ్యంలో నిర్వహించిన ఈ వేడుకలో ఇద్దరు హీరోలు స్కైరూట్ బృందాన్ని అభినందించారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలు సాధిస్తున్న విజయాలు గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ.. నాగార్జునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. చిన్నప్పటి నుంచి రాకెట్ శాస్త్రవేత్త కావాలనే కల ఉండేదని, విక్రమ్-1 ప్రయోగాన్ని కుటుంబంతో కలిసి ఉత్కంఠగా వీక్షించానని నాగార్జున చెప్పిన మాటలు తమకు ఎంతో ప్రేరణనిచ్చాయని సంస్థ ఎక్స్ (X) వేదికగా వెల్లడించింది.
'మిషన్ ఆగమన్ (Mission Agaman)' విజయంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని చేరుకుందని స్కైరూట్ పేర్కొంది. ఈ వేడుకలో సంస్థ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
